నా పేరు డొక్కా ఫణి (డొక్కా శ్రీనివాస ఫణి కుమార్). ఇంట్లో అందరికీ “శీను”. ఫ్రెండు గాళ్ళు, ఫ్రెండు రాళ్ళు అందరికీ, బయట ప్రపంచానికీ “ఫణి”. ఎప్పుడో 70 లలో మన రవణ గారి ధవళేస్రం లో పుట్టి, అమలాపురంలో పెరిగి, హైదరాబాదులో చదువుకుని, తొంభైలలో అమెరికా వచ్చాను. ఇక్కడ మళ్ళీ చదువుకుని, ఉజ్జోగం చేసుకుంటున్నాను.
నాలో వందరకాల స్ప్లిట్ పెర్సనాలిటీలు. వాటికి తగ్గట్టుగా వందరకాల హాబీలు. అంజేత, మనలో చానా సెకలున్నాయన్నమాట.
కథలు, కవితలు, పద్యాలు రాసాను, రాస్తున్నాను. వందలాది సినిమా పాటల కార్యక్రమాలు చేసాను, పాడాను, పాడుతున్నాను.
సినిమా దర్శకునిగా మారి రెండు సినిమాలు చేసాను. మొదటి సినిమా కి బంగారు నంది ఇంటికొచ్చి, మా ఇంట్లోని శివయ్యకెదురుగా కూర్చుంది.
50 కి పైగా అష్టావధానాలు, రెండు శతావధానాలు నిర్వహించాను (నేను చేయలేదు, పెద్దవారి అవధాన కార్యక్రమాలు నిర్వహించాను), అప్రస్తుత ప్రసంగం అనే అంశంలో పృఛ్చకునిగా పాల్గొన్నాను (ఇంచుమించు అన్ని సార్లూ అదే అంశం, నాకిష్టం కనుక).
కొన్ని వేల పద్యాలు రాసాను. ఒక శతకం రాసాను. “పల్లకి”, “టేకిటీజీ”, “మా ఆఫ్రికా సఫారీ (నేను, అన్న)” వంటి పుస్తకాలు ప్రచురించాను.
“పసిడి పూర్ణమ్మ” అనే కూచిపూడి నృత్య రూపకం వ్రాసాను. రుక్మిణీ కల్యాణం కూచిపుడి రూపకంలో “సూత్రధారుడు”, “అగ్నిద్యోతనుడు” పాత్రలు ఎన్నోసార్లు ధరించాను. “మేనకా విశ్వామిత్ర” కూచిపూడి రూపకంలో పాడాను.
ఇంత అల్లరి చేస్తున్నందుకు ముచ్చటపడి “సాహితీ రత్న” (అక్కినేని ఫౌండేషన్, వంశీ సంస్థ – ఇండియా), “సాహిత్య కళా భారతి” (భారతీతీర్థ సంస్థ, అమెరికా విభాగం) వంటి బిరుదులు కూడా తగిలించేసారు.
ఈ-టీవీ వారి ఎన్నో సంగీత, సాహిత్య కార్యక్రమాలకు ముందు మాటలు రాసాను. అవన్నీ బాలు గారు, భరణి గారు వంటి పెద్దల గొంతులో ముస్తాబై వచ్చి, అచ్చమైన తెలుగు అమ్మాయిలై అలరించాయి.
దశాబ్దానికి పైగా మా అట్లాంటాలో పిల్లలకి నా కొచ్చిన కుంచెం తెలుగులోంచి కుంచెం చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా ఎవరైనా ఫిజిక్సు చెప్పమన్నా, లెక్కలు చెప్పమన్నా, ఏ.పీ క్లాసులు చెబుతున్నాను అప్పుడప్పుడు, ఆన్లైన్ లో.
మా తాతగారి అంత బాగా కాకపోయినా, బానే చెస్సు ఆడతాను. రాంకింగు ఇంచుమించు ఓ 1600 పైచిలుకు ఉంటుంది. టెన్నీసు కూడా ఓ మోస్తరగా ఆడతాను. తిక్క రేగినప్పుడు సెర్వ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఉత్తప్పుడు మామూలే.
అన్నట్టు మీకు నిరతాన్నదాత్రి శ్రీమతి.డొక్కా సీతమ్మగారు తెలుసా ? తెలిస్తే మీకో సీక్రెట్. ఆవిడ మా మామ్మగారన్నమాట. ఆవిడ పెద్ద కుమారుడు కీ.శే సుబ్రహ్మణ్య శర్మ (సుబ్బారాయుడు) గారి కుమారుడు కీ.శే డొక్కా రామభద్రుడు గారు మాకు తాతగారు. వారి కుమారుడు మా నాన్న గారు కీ.శే డొక్కా సూర్యనారాయణగారన్నమాట. (నాన్న గారి పేరుముందు కీ.శే అని రాయలంటే చేతులు రావట్లేదు, మాకు చెప్పకుండా ఆయన పైకి వెళిపోయి రెండేళ్ళయిపోయింది, ప్రస్తుతం కటీఫ్ అన్నమాట).
ఇంకా బోల్డు చెప్పాలి, కానీ అన్నీ నేనే చెప్పేస్తానా ఏవిటి? మీరు “బులుగు గారూ, బులుగు గారూ, నాతో ఫ్రెండ్షిప్ చేత్తారాండీ, అప్పులు మీగురించి ఇంకా బోల్లు తెలుత్తుంది” అంటే, నేను ఓ మాటు రవణ గారినడిగి “సరే, అలాగే చేత్తా” అంటానన్నమాట. అప్పట్నించీ “చుక్ చుక్ రైలూ వత్తోంది”, “బుజ బుజ రేకుల పిల్ల ఉంది” అంటూ ఆడుకోచ్చన్నమాట, ఎంచక్కా.

